అకున్ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిగా మీడియా చిత్రీకరిస్తుందని, అకున్‌ను హీరోగా పెట్టి దర్శకుడు రాజమౌళి బాహుబలి 3 సినిమా తీయాలని ఫేస్‌బుక్‌లో రామ్‌గోపాల్ వర్మ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్, సుబ్బరాజును 12 గంటల పాటు విచారించినట్లే డ్రగ్స్ తీసుకున్న పాఠశాల పిల్లలను కూడా విచారిస్తారా? అని వర్మ ఎక్సైజ్ శాఖ అధికారుల్ని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ తమ పబ్లిసిటీ కోసం సినిమా వాళ్ళను వాడుకుంటోందని అన్నారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్ శాఖ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులను కించపరుస్తున్నారని అన్నారు.
దీంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. పోలీసు శాఖ పనితీరుని నేను తక్కువ చేయలేదని కేవలం సినిమా పరిశ్రమను, సెలబ్రిటీలను గౌరవించండని మాత్రమే తెలియజేయాలనుకున్నానని అన్నారు. ఎక్సైజ్ శాఖపై తాను చేసిన కామెంట్లు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తో పాటు ఆ శాఖకు క్షమాపణలు చెప్పారు.