మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ నటించిన తొలిచిత్రం ‘చిరుత’ విడుదలై నేటికి సరిగ్గా 12 ఏళ్ళు. చరణ్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేస్తూ పూరి జగన్నాథ్ చేసిన ప్రయత్నం ఫలించి చిరుత మంచి విజయం సాధించింది. డాన్సులు, ఫైట్స్ తో అదరగొట్టిన చరణ్ స్టార్ సన్ అనుకున్నారు కానీ ఆ స్టార్ వారసత్వాన్ని కొనసాగించగలడా అనే సందేహాలు తొలి చిత్రం తర్వాత అలాగే ఉన్నాయి. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. చరణ్ పెర్ఫార్మెన్స్, నటనకు ప్రశంసలు దక్కాయి. చిరు కొడుకుగానే చరణ్ సినీరంగ ప్రవేశం జరిగింది. పూరీజగన్నాధ్ దర్శత్వంలో చరణ్ సినీరంగప్రవేశం జరిగింది.
మగధీర చిత్రంతో చరణ్ ఇమేజ్ మాస్ ఆడియన్స్ లో దూసుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత రచ్చ, ఎవడు, నాయక్ లాంటి చిత్రాలు రాంచరణ్ మాస్ ఇమేజ్ ని పెంచుకుంటూ పోయాయి. ధృవ చిత్రంతో విభిన్నమైన ప్రయత్నాలకు సైతం తాను సిద్ధం అని చరణ్ సంకేతాలు పంపాడు. గతేడాది విడుదలైన రంగస్థలం చిత్రంతో బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టడమే కాక అప్పటి దాకా ఆయన నటన గురించి వచ్చిన విమర్శలన్నిటికీ సమాధానం ఇచ్చాడు. అయితే మొన్న సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ గా నిలిచినా ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమాతో మళ్ళీ ఫాంలోకి వస్తాడని భావిస్తున్నారు. ఇక చరణ్ చిత్రపరిశ్రమలో 12 ఏళ్ళని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు.