రామ్ చరణ్ కు జంటగా సమంతా నటించబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో కూడా వీరి కాంబినేషన్ లో సినిమాలు రవాల్సింది కానీ కుదరలేదు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా సమంత పేరు వినిపిస్తోంది. మొన్నటిదాకా ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నా పేరు చరణ్ సూచించాడని.. పాత్ర కోసం అమ్మడు తన శరీర బరువును తగ్గించే పనిలో పడిందని వార్తలు వినిపించాయి.
రాశి సన్నబడడంతో ఇక చరణ్ పక్కన ఛాన్స్ ఆమెకే అనుకున్నారంతా. కానీ అంతలోనే ఏమైందో.. రాశికి బదులుగా సమంతను తీసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ గానం. నాగచైతన్యతో పెళ్లి కుదిరిన తరువాత సమంత తెలుగు సినిమాలేవీ అంగీకరించలేదు. చరణ్ సినిమా అంగీకరించడం విశేషం. డిసంబర్ చివరి వారం లేదా.. జనవరి నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.