HomeTelugu Trendingవారి స్ఫూర్తితో.. తెలుగు రాష్ట్రాలకు రామ్‌ చరణ్‌ భారీ విరాళం

వారి స్ఫూర్తితో.. తెలుగు రాష్ట్రాలకు రామ్‌ చరణ్‌ భారీ విరాళం

7 24
టాలీవుడ్‌ స్టార్‌ హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌.. కేంద్ర, తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని ప్రకటించారు. గురువారం ట్విటర్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన అధికారిక ఖాతా వేదికగా.. కరోనా కల్లోలం కోసం పాటుపడుతోన్న కేంద్ర, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నానని తెలియచేస్తూ తొలి ట్వీట్‌ను చేశారు. ‘పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌తో స్ఫూర్తి పొందిన నేను.. కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాలకు నా వంతు సాయంగా రూ.70 లక్షలను ఆయా సహాయనిధిలకు అందిస్తున్నాను. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఎంతో కష్టపడుతున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌లకు నా అభినందనలు. ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రభుత్వాలు చెప్పిన నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని కోరుతున్నాను. జైహింద్‌’ అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

ట్విటర్‌లోకి అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే రామ్‌చరణ్‌ను దాదాపు 19 వేల మంది ఫాలో అయ్యారు. ఆయన తన తండ్రి చిరంజీవిని, బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ను అనుసరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రౌద్రం రణం రుధిరం సినిమాలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రౌద్రం రణం రుధిరం సినిమా టైటిల్‌ లోగోతోపాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu