ప్రశాంత్ వర్మ టాలీవుడ్‌లో అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ఆ తరువాత జాంబీరెడ్డి, కల్కి, అద్భుతం వంటి సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశాడు. ఆయన తాజాగా హనుమాన్ మూవీతో దర్శకుడిగా మరో లెవల్ కు వెళ్లిపోయాడు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది వచ్చిన ఆదిపురుష్ మూవీని ఎంతో మంది ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలో ప్రశాంత్ వర్మ కూడా దీనిపై స్పందించాడు. హనుమాన్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్.. ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సినిమా ఎలా తీయాలో, ఎలా తీయకూడదో తాను ఇతర సినిమాలు చూసే తెలుసుకుంటానని అతడు అన్నాడు.
తెలుగు సినిమా ఎప్పుడూ భారత ఇతిహాసం, హిందూ ధర్మాన్ని కించపరిచేలా సినిమాలు చేయలేదని అతడు చెప్పాడు. “రామాయణం, మహాభారత ఆధారంగా తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ గారు అలాంటివి ఎన్నో సినిమాలు తీశారు. ఎప్పుడూ సమస్య రాలేదు. అవి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. మా వరకూ కృష్ణుగు అంటే ఎన్టీఆర్.
“నేను ఈ జానర్ లో వచ్చిన అన్ని సినిమాలు చూస్తాను. దాని వల్ల ఓ సినిమాను ఎలా తీయాలి? ఎలా తీయకూడదు అన్నది తెలుసుకుంటాను. నేను ఇతర దర్శకుల గురించి మాట్లాడను కానీ మన సంస్కృతిలోని స్టోరీల గురించి నేనెప్పుడూ తప్పుగా చూపించను. రామాయణం, మహాభారతాలను నా స్టైల్లో చూపించాలని అనుకున్నాను. కానీ ఓ డైరెక్టర్ గా నాకు ఆ స్థాయి పరిణతి, అనుభవం లేవని అనుకుంటాను. అందుకే ఆ పాత్రల నుంచి ఫిక్షనల్ స్టోరీలను క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నాను” అని ప్రశాంత్ వర్మ అన్నాడు.
‘హనుమాన్’ మూవీ సక్సెస్ తో హిందూ దేవుళ్లే సూపర్ హీరోలుగా తాను 12 సినిమాలు తీయబోతున్నానని, వచ్చే ఏడాది జై హనుమాన్ పేరుతో మరో సినిమా తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ రాముడి పాత్రలో నటించనున్నట్లు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎంటువంటి ప్రకటన రాలేదు.