బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్‌సీబీ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నిన్ననే విచారణకు హాజరుకావాల్సి ఉంది. తనకు నోటీసులు అందలేదని రకుల్ వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్‌సీబీ అధికారులు ఎన్‌బీడబ్ల్యూ జారీచేస్తారనే వార్తల నేపథ్యంలో నోటీసులు అందినట్లు రకుల్ వెల్లడించింది. సుశాంత్ సింగ్ మృతి తర్వాత రియా అరెస్టుతో డ్రగ్స్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. రియా విచారణలో భాగంగా రకుల్, దీపిక, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. వీరికి ఇప్పటికే ఎన్‌సీబీ నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. రియా, రకుల్‌ప్రీత్ మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య జరిగిన డ్రగ్స్ ఛాటింగ్‌పై రకుల్‌ను ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో రేపు విచారణకు దీపికా పదుకునే హాజరుకానుంది.