తలైవా స్టయిల్, మేనరిజానికి ఫిదా కానివారు ఎవరూ ఉండరు సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఆ క్రేజే వేరు. “బాషా” తర్వాత “పేట”తో సంక్రాంతి బరిలో నిలిచిన రజనీకాంత్.. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులనూ విశేషంగా అలరిస్తున్నారు. జనవరి 10న విడుదలైన “పేట” మూవీ భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.125.80 కోట్లు రాబట్టింది.
దక్షిణాదిలో సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలను “పేట” దాటేసింది. తమిళంలో “పేట” సినిమాకు పోటీగా అజిత్ “విశ్వాసం” విడుదలైనా దాని ప్రభావం ఈ సినిమా కలెక్షన్లపై ఏ మాత్రం పడటం లేదు. చాలాకాలం తర్వాత పాత రజనీని చూశామంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఐదు రోజుల్లో ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే రూ.62 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.40కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.6.95కోట్లు, కర్ణాటకలో రూ.8.50కోట్లు, కేరళలో రూ.4.60కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.3.75కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగులో “పేట” సినిమాకు చాలా తక్కువ థియేటర్లు ఇవ్వడంతో నిర్మాత అశోక్ వల్లభనేని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరు పెద్ద నిర్మాతలు కావాలని తన సినిమాను తొక్కేస్తున్నారంటూ తీవ్ర పదజాలంతో ఆయన మండిపడ్డారు. జనవరి 10న తక్కువ థియేటర్లలోనే ఈ సినిమా విడుదలైనప్పటికీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్లు పెంచేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారట. దీంతో తెలుగులోనూ “పేట” కలెక్షన్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.