సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తున్నారు. ఐదు దశాబ్దాల క్రితం మొదలైన ఆయన సినీ ప్రయాణంలో 160కి పైగా చిత్రాలు చేశారు. దేశంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ ప్రయాణం చరిత్రగా మారనుందా..? సూపర్ స్టార్ సినిమాలకు రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు అనే వార్తలు ఇటీవలే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి రజనీకాంత్ స్పందించారు. తన సినిమా భవిష్యత్తుపై ఒక హింట్ ఇచ్చారు.
ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ‘అన్నాత్తె’ తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ తన చిత్రబృందంతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారట. తనకు మరికొన్నాళ్లు సినిమాల్లో నటించాలని ఉందని, కానీ ఆరోగ్యం సహకరిస్తుందో లేదో చూడాలని తన మనసులోని మాట బయట పెట్టారట. కరోనా తగ్గి, పరిస్థితులు చక్కపడితే ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాగా.. ఆయన నటిస్తున్న ‘అన్నాత్తె’ సినిమాలో కీర్తి సురేశ్, నయనతార, మీనా, కుష్భూ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.