సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు(శనివారం) ఉదయం ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సాధారణ వైద్య పరీక్షలు కోసం ఆయన సతీమణి లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా పయనమయ్యారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో తీసిన రజనీకాంత్ ఫొటోలు వైరల్‌గా అవుతున్నాయి. కాగా కొన్ని సంవత్సరాల క్రితంరజనీ అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ అప్ కోసం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇక గత సంవత్సరం కోవిడ్ -19 ఆంక్షల కారణంగా, ఆయన అమెరికా వెళ్లలేకపోయారు. అయితే ఈ సారి కోవిడ్ వేవ్ కారణంగా విదేశాలకు వెళ్ళేందుకు ఆంక్షలు ఉండటంతో రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అమెరికా వెళ్ళడానికి అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం రజనీకాంత్‌కు అనుమతి ఇవ్వడంతో శనివారం ఉదయం తన భార్యతో కలిసి చెన్నై నుంచి స్పెషల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు బయలుదేరారు. ఈ స్పెషల్ ఫ్లైట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమెరికా వెళుతున్నారు. కొన్ని వారాల పాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఆయన తిరిగి జూలై 8 న భారత్ కు వస్తారని తెలుస్తోంది.
కాగా రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ దాదాపు పూరైయింది. ఇందులో రజనీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది. కొంత భాగమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే దీపావళి సందర్భంగా విడుదల కానుంది.