రజినీకాంత్ త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పడు ఆ ఆలోచనను విరమించుకుంటున్నానని రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు రజినీకాంత్ ట్వీట్ చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశంపై మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తన అభిమానులకు నిరాశ కలిగిస్తుందనే విషయం తనకు తెలుసని.. ఈ విషయంలో అభిమానులు తనను క్షమించాలని రజినీకాంత్ కోరారు.
రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. తన అనారోగ్యం కారణంగా తాను నటిస్తున్న ‘అన్నాత్తై’ సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. ఈ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారని రజినీకాంత్ అన్నారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలవాల్సి ఉంటుందన్న రజినీకాంత్.. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే తనను నమ్మకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోతారని అన్నారు.
అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన చెన్నై చేరుకున్న వెంటనే తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కుటుంబసభ్యులతో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో… రాజకీయ పార్టీ ఏర్పాటు వద్దని కుటుంబసభ్యులు ఆయనకు సూచించినట్టు సమాచారం. రాజకీయాల్లోకి అడుగుపెడితే.. ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయని కొందరు సన్నిహితులు రజనీకాంత్‌కు సలహా ఇచ్చారని తెలుస్తోంది. అందుచేత కొత్త పార్టీ ఏర్పాటు ఇప్పట్లో వద్దని నిర్ణయం తీసుకున్నారు.