2009లో శివాజీ సినిమా సక్సెస్ మీట్ లో అభిమానులను కలిసిన రజినీకాంత్ దాదాపు 9 తొమ్మిదేళ్ల తరువాత ఇప్పుడు తన అభిమానులను చెన్నైలో కలిశారు. వారితో కలిసి ఫోటోలు దిగడానికి నాలుగు రోజుల సమయం కేటాయించారు. భారీ ఎత్తున సూపర్ స్టార్ అభిమానులను కలవడం ఇదే మొదటిసారి. చెన్నైలోని రాఘవేంద్ర వెడ్డింగ్ హాల్ లో ఈ సమావేశం జరుగుతోంది. సుమారుగా 17 జిల్లాల నుండి అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సమావేశంలో రజినీకాంత్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులను కలవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన త్వరలోనే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనున్నట్లు వెల్లడించారు.
అలానే శ్రీలంక పర్యటన వివాదంపై స్పందించారు. ఆయనెప్పుడూ వెనుకడుగు వేయలేదని కొందరు రాజకీయ నేతలు కావాలని ఆయన పేరును దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేవుడు నటనే నా వృత్తిగా ఆదేశించాడని ఆయన ఆదేశాన్ని పాటిస్తున్నానని అన్నారు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలని ఆదేశిస్తే ఖచ్చితంగా రాజకీయరంగ ప్రవేశం చేస్తానని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తే నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తానని అన్నారు. అయితే 21 ఏళ్ల క్రితం రాజకీయాల్లో చేదు అనుభవం ఎదురైందని పేర్కొన్న రజినీకాంత్ తను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు.