తమిళ హీరో శింబు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లండన్‌కు చెందిన అమ్మాయిని ఆయన మనువాడబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆమె శింబు బంధువుల అమ్మాయని రాసుకొచ్చారు. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత వివాహం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. మరోపక్క ఇటీవల శింబు వంట చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. అందులో ఆయన భవిష్యత్తులో తనకు కాబోయే భార్యను కష్టపెట్టనని, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని అనడంతో వదంతులు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో శింబు తల్లిదండ్రులు టి. రాజేందర్, ఉషా రాజేందర్ ప్రకటన విడుదల చేశారు. తమ కుమారుడికి కాబోయే భార్యను ఇంకా నిర్ణయించలేదని, బంధువుల అమ్మాయితో పెళ్లి జరగడం లేదని స్పష్టం చేశారు. ఆయన పెళ్లంటూ రాసిన వార్తలు కేవలం వదంతులని అన్నారు. ‘ప్రస్తుతం మా కుమారుడికి తగిన అమ్మాయి కోసం వెతుకుతున్నాం. ఇద్దరి జాతకాలు చూస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.