భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తన ధైర్య సాహసాలతో యావత భారతదేశం మనసును గెలుచుకున్నాడు. శతృదేశానికి చిక్కిన కూడా ఎక్కడ భయపడక ఎదురొడ్డి నిలబడి తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. దీంతో అభినందన్ భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. దీంతో అభినందన్ సాహస గాథను రాజస్థాన్ విద్యార్థులు ఇకపై పాఠ్యాంశంగా చదవుకోనున్నారు. అభినందన్ శౌర్యానికి గౌరవార్థం పాఠ్యాంశంగా చేర్పించాలని రాజస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. అభినందన్ స్టోరీని స్కూల్ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలంటూ రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతాస్ర ప్రతిపాదించారు.
ఐఏఎఫ్ పైలట్ అభినందన్ జోధ్‌పూర్‌లోనే విద్యాభ్యాసం చేసినట్టు మంత్రి గోవింద్ ఇవాళ ట్విటర్లో పేర్కొన్నారు. వైమానిక దాడుల సమయంలోనూ, ఆ తర్వాత అభినందన్ కనబర్చిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆయనను గౌరవించేందుకే రాజస్థాన్ స్కూల్ సిలబస్‌లో అభినందన్ జీవిత చరిత్రను పొందుపర్చనున్నట్టు వెల్లడించారు. అయితే మంత్రి చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే రివ్యూ కమిటీ నుంచి ఆమోదం లభించింది.