‘మా’ నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది. అధ్యక్షుడిగా నరేశ్ ప్రమాణస్వీకారం చేస్తూ ‘నేను అసోసియేషన్ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. నరేశ్ ప్రమాణ స్వీకారం చేసిన తీరుపై సినీనటుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నరేశ్ మాట్లాడిన ప్రతి మాటలో ‘నేను’ అనే పదం ఉందని.. ఎక్కడా ‘మేము’ అని ఆయన పేర్కొనలేదంటూ రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నరేశ్ అన్నీ మాట్లాడేశారు’ అని చెబుతూ రాజశేఖర్ మైక్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ తన సతీమణి జీవిత చేతిలో నుంచి మైక్ అందుకుని.. ‘నేను మాట్లాడటానికి చాలా ఉంది. మీకు ఓపిక ఉంటే వినొచ్చు. నరేశ్ ‘నేను నేను’ అన్న మాట వాడి ఉండకూడదు. ‘మేము’ అని మాట్లాడాలి. నేను ఈ కార్యక్రమానికి రావాలనుకోలేదు. నరేశ్ వచ్చి పిలిచారు.. ఆయన నాకు మంచి మిత్రుడు కాబట్టి వచ్చాను. అందరం కలిసే ఈ అసోసియేషన్ ఎన్నికల కోసం పనిచేశాం. కాబట్టి మున్ముందు నరేశ్ మాట్లాడేటప్పుడు ‘నేను’ అని కాకుండా ‘మేము’ అని మాట్లాడితే బాగుంటుంది’ అని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నరేశ్ పక్కనుంచి.. ‘నేనేదో సరదాగా అన్నాను. మనమందరం కలిసే చేశాం’ అంటూ ఆయన్ను సముదాయించేందుకు ప్రయత్నించారు.