గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. పిల్లలను బడికి పంపించే తల్లులకు జనవరి 26న రూ.15వేలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘చిన్నారులు బడికి వెళ్లాలి.. పెద్ద పెద్ద చదువులు చదివి డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. పిల్లల్ని చదివించేందుకు వారి తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు. నా సుదీర్ఘ పాదయాత్రలో.. పిల్లల చదువుకోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూశా. ఈ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు తీసుకొస్తానని ఆరోజే చెప్పా. మీ పిల్లల చదువును నేను చూసుకుంటానని మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకునే రోజు ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి తల్లికి, చెల్లికి ఒకేమాట చెబుతున్నా.. మీ పిల్లలను బడికి పంపండి. ఏబడికి పంపినా ఫర్వాలేదు. జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా పండుగ దినం నిర్వహించి.. ఆరోజు ప్రతి తల్లి చేతిలో రూ.15000 పెడతాం. ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో చదువురాని వారు సగటున 26 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 33 శాతం ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఎందుకున్నామని పరిశీలిస్తే.. సరైన సమయంలో విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందవు. సెప్టెంబరు దాటినా పుస్తకాలు అందని దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పాఠశాలల్లో టాయిలెట్స్, ఫర్నిచర్ సరిగా ఉండవు. మరో వైపు ప్రభుత్వ పాఠశాలలను నీరుగార్చి, కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 40వేల పాఠశాలల ఫొటోలు తీయిస్తాం. రెండేళ్ల తర్వాత అభివృద్ధి ఎలా జరిగిందో మళ్లీ ఫొటో తీసి చూపిస్తాం. కచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నా. ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతాం. దాంతో పాటు తెలుగు సబ్జెక్టును తప్పని సరి చేస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.