టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మగధీర తర్వాతే మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో కేఎల్ నారాయణ నిర్మాణంలో ఒక సినిమా రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. బాహుబలి తర్వాత కన్ఫామ్ అనుకున్న సమయంలో ఆర్ఆర్ఆర్ ను మొదలు పెట్టాడు.
పలు ఇంటర్వ్యూల్లో ఆర్ఆర్ఆర్ తర్వాత తాను ఖచ్చితంగా మహేష్ తో సినిమాను చేస్తానంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు. అది వచ్చే ఏడాది ద్వితీయార్థంకు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. ఇప్పటికే జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక కథను సిద్దం చేశాడని కూడా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యి విడుదల అయిన తర్వాత జక్కన్న ఆ కథపై కూర్చుంటారు. ఆ కథను తన విజన్ కు తగ్గట్లుగా మార్చుకుని స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటాడు. ఈ మూవీకి దాదాపుగా రూ.250 కోట్ల బడ్జెట్ ను పెట్టేందుకు నిర్మాత కేఎల్ నారాయణ సిద్దంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.