ఏఐఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించారు. ఇవాళ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన అక్కడి నుంచి అలిపిరి అద్దాల మండపం వద్దకు కారులో చేరుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అలిపిరిలో ఉదయం 11:40 గంటల సమయంలో నడక ప్రారంభించి మధ్యాహ్నం 1:30 గంటలకు కొండపైకి చేరుకున్నారు. కేవలం గంటా 50 నిమిషాల వ్యవధిలోనే తిరుమలకు చేరుకున్నారు. మేనల్లుడు రేహాన్ వాద్రాతో కలసి పోటీపడుతూ నడిచారు. నడక మార్గంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా సుమారు 3500లకు పైగా మెట్లు ఎక్కారు. జీఎన్‌సీ ప్రాంతం నుంచి నడుస్తూనే అతిథి గృహానికి చేరుకున్నారు. గాలిగోపురం వద్ద సాధారణ భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్లను పొందారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు.