చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంకు ‘దర్శకేంద్రుడు’ రాఘవేంద్రరావు ఆర్థిక సాయం చేశారు. మల్లేశం జీవితాధారంగా వచ్చిన ‘మల్లేశం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పాత్రలో ప్రముఖ నటుడు ప్రియదర్శి నటించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు చిత్రబృందాన్ని కలిసి అభినందించారు.
‘మల్లేశం’ సినిమా చూశాను. ఒక ప్రయోజనం ఉన్న చిత్రమిది. చేనేత కార్మికురాలిగా తల్లి పడుతున్న ఆవేదనను చూసి పెద్దగా చదువుకోకపోయినా ఆసు యంత్రాన్ని కనుగొని, ఆ కార్మికుల కష్టాలను కొంత మేర తగ్గించి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న చింతకింది మల్లేశం అభినందనీయుడు. ఆ కృషిలో భాగంగా నా వంతు సాయంగా నాలుగు ఆసు యంత్రాలు కొనుగోలు చేయడానికి లక్ష రూపాయాలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ ఇతర నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాజ్‌కు అభినందనలు. మంచి ప్రయత్నం చేసిన మల్లేశం బృందానికి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.