నటుడు, దర్శకుడు.. రాఘవ లారెన్స్ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను రాఘవ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. రజనీని కలవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘నా అభిమానులకు, స్నేహితులకు హాయ్. ఈరోజు హైదరాబాద్‌లో తలైవార్ను కలిశాను. ఆయన నుంచి నూతన సంవత్సర ఆశీర్వాదాలు తీసుకున్నాను. నాతో చాలా ఎక్కువ సమయం గడిపినందుకు థ్యాంక్యూ తలైవా. మీరు నా మీద చూపించే ప్రేమ మనల్ని మరింత దగ్గర చేస్తోంది.’ అని రాఘవ పేర్కొన్నారు.
రజనీకాంత్‌కు వీరాభిమాని అయిన రాఘవ ఇటీవల ‘దర్బార్’ ఆడియో విడుదలలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో నెటిజన్లు ఆయనపై ట్విటర్లో ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి బయట నిర్వహించే ఏ కార్యక్రమాలకు హాజరుకాబోనని ప్రకటన చేశారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు.
ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. ”హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ మీకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక నుంచి బయట జరిగే ఏ కార్యక్రమానికి నేను హాజరుకాను. తలైవర్(రజనీకాంత్) కార్యక్రమానికి కూడా ఆయన అనుమతి లేకుండా రాను.
దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ నేను మీతో పంచుకోలేను. ఆయన(రజనీ) దీవెనలు కన్నా ఏదీ ఎక్కువ కాదు” అని ఆయన వివరించారు.