నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఎటువంటి విషయమైన సరే ముక్కుసుటిగా చెబుతుంటుంది. ఆమె నటించిన ‘వెల్వేట్ నగరం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి ఓ తమిళ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమాలతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఈ ఇంటర్య్వూలో పంచుకున్నారు. ఇతరులు ఏం అనుకున్నా తనకు అనవసరమని, తన జీవితం తన ఆధీనంలో ఉండటం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
తన తండ్రి శరత్ కుమార్ భార్య రాధికను ఆంటీ అని పిలవడం గురించి మాట్లాడుతూ… ‘ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. రాధిక మా అమ్మ కాదు. కానీ మేం చాలా సన్నిహితంగా ఉంటాం. ఆమె, నాన్న పెళ్లి చేసుకుని.. దంపతులుగా సంతోషంగా ఉండటం నాకు ఆనందమే. అంతేకాదు రాధిక ఆంటీ కుమార్తె రయానేకు నాన్న మంచి తండ్రిగా ఉన్నారు’ అని చెప్పారు.
చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ.. ‘నా సినీ కెరీర్‌లో కేవలం ఒక్కసారి క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైనప్పుడు గట్టిగా నో చెప్పండి. వ్యతిరేకిస్తే అవకాశాలు తగ్గి వెనకబడుతాం. అంతేకానీ కెరీర్ ఆగిపోదు’ అని వరలక్ష్మి పేర్కొన్నారు.