స్టార్ హీరో విజయ్ సేతుపతి కార్యాలయాన్ని తమిళ చిరువ్యాపారుల సంఘాలు ముట్టడించాయి. విజయ్ సేతుపతి కొంతకాలంగా ప్రకటనల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా ‘మండి’ అనే ఆన్‌లైన్ కిరాణా సరకుల యాప్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఇటీవల దీనికి సంబంధించిన వీడియోలను చూసిన సాధారణ కిరాణా వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం చిరు వ్యాపార సంఘాల నాయకులు విజయ్ సేతుపతి కార్యాలయాన్ని ముట్టడించారు. చిన్నపాటి దుకాణాలతో జీవనం సాగిస్తున్న తమ కడుపులు కొడుతున్న ఇలాంటి వ్యాపార సంస్థలకు విజయ్ వంటి యువ నటుడు చేయూతనివ్వడం సముచితం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విజయ్ సేతుపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.