టాలీవుడ్ నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్ అయ్యాడు. తన పనేదో తాను చూసుకుంటూ.. తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేస్తుంటాడు. దాంతో పాటు సామాజిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటాడు. ఉద్యమ సినిమాల హీరో ఆర్.నారాయణమూర్తిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో నారాయణమూర్తి కూడా కాలు కదిపాడు. వాళ్లకు మద్దతుగా హైదరాబాద్‌లో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం నిర్వహించారు. ఆ ర్యాలీలో ఆర్. నారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందరికీ కూడా పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. రాజ్ భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనాకారులను పోలీసులు అడ్డుకున్నారు. అందులో మూర్తి కూడా ఉన్నారు.
లోపలకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ నిలిపేశారు. అయినా కూడా ఆందోళనకారులు వినలేదు. వెంటనే అక్కడ్నుంచి తిరిగి వెళ్లిపోమని పోలీసులు చెప్పారు. కానీ ఆందోళనకారులు నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ అయిన వాళ్ళలో ఆర్ నారాయణ మూర్తి కూడా ఉన్నారు. అరెస్టు సమయంలో ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఏ మాత్రం ప్రయోజనకారి కాదు.. 2006లో బిహార్‌లో ఇలానే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు.. దాని వల్ల అక్కడ మొత్తంగా రైతులే లేకుండా పోయారు.. ఇప్పుడు ఆ రైతన్నలే కూలీలుగా మారిపోయారు.. ఆ పరిస్థితిని గుర్తు చేసుకొని కేంద్రం ఈ కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఏదేమైనా కూడా ఆర్ నారాయణమూర్తి అరెస్ట్ విషయం మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.