బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ‘క్వీన్’ దర్శకుడు వికాస్ బెహెల్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తున్నారు. వికాస్‌తో పాటు బాలీవుడ్ దర్శకుడు మధు మంతెన, అనురాగ్ కశ్యప్ కలిసి ఫాంటమ్ ఫిలింస్ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతి వికాస్ తనను వేధిస్తున్నారని ఇటీవల మీడియా ద్వారా వెల్లడించింది. దీనిపై కంగన స్పందిస్తూ ఆమె చెప్పేది నూటికి నూరు శాతం నిజమేనని అన్నారు.
‘క్వీన్’ సినిమా చిత్రీకరణ సమయంలో నేను, వికాస్ ఎప్పుడు కలిసినా అతను నన్ను విష్ చేస్తున్నట్లుగా ఆలింగనం చేసుకునేవాడు. కానీ అతను నన్ను గట్టిగా కౌగిలించుకుని నలిపేసేవాడని ఎవరికీ తెలీదు. దాంతో వదిలించుకోవడానికి చాలా ప్రయత్నించేదాన్ని. వికాస్‌కు పెళ్లయినప్పటికీ పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకునేవాడు. ఇతరుల పెళ్లి, ప్రేమ విషయాల గురించి నేను తప్పుబట్టను కానీ అలవాటు వ్యసనంగా మారినప్పుడు చెప్పడంలో తప్పులేదు. రోజూ రాత్రిళ్లు పార్టీలకు హాజరవుతుండేవాడు. నేను చిత్రీకరణతో అలసిపోయి త్వరగా నా హోటల్ గదికి వెళ్లి నిద్రపోయేదాన్ని. దాంతో నేను త్వరగా నిద్రపోతానని అందరి ముందు ఎగతాళి చేసేవాడు. ‘క్వీన్’ సినిమా తర్వాత మరో స్క్రిప్ట్‌తో నా వద్దకు వచ్చాడు. కొన్ని మార్పులు చేయమని చెప్పాను. దాంతో అతను నాతో మాట్లాడటం మానేశాడు. అలా సినిమా చేజారిపోయింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు’ అని కంగనా తెలిపారు.