ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణికుల ఇబ్బందులపై గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు. అక్కడకు వైద్య బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు. సరిహద్దుల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నల్గొండ అధికారులను కూడా కోరతామన్నారు. నిబంధనల ప్రకారం వారిని వెంటనే ఊర్లలోకి అనుమతించలేమని స్పష్టం చేశారు. క్వారంటైన్ గడువు తర్వాత మాత్రమే వారు ఇంటికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. క్వారంటైన్‌కు అంగీకరించే వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తామని తేల్చి చెప్పేసారు. రెవెన్యూ అధికారులను కూడా సరిహద్దు వద్దకు పంపిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో నిన్న నుంచి వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో నిలిచిపోయిన వారితో మాట్లాడుతున్నాం. ముందస్తు సమాచారం లేకుండా హైదరాబాద్ నుంచి రావడం వల్లే సమస్యలు. క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. సరిహద్దుల్లో ఆగిన వారితో సంయమనంతో మాట్లాడాలని పోలీసులకు సూచించాం. రెవెన్యూ అధికారులతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం” అని స్పష్టం చేశారు.