Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్నను ప్రకటించింది కేంద్రం. భారతరత్న దేశ అత్యున్నత పౌర పురస్కారం పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా కేంద్రం ఇవాళ భారత రత్న అవార్డును ప్రకటించింది.
దీంతో అవార్డు గ్రహీతలకు సీని, రాజకీయా ప్రముఖులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. పీవీ ఓ మేధావి అని, రాజనీతజ్ఞుడు అని తన ఎక్స్ అకౌంట్‌లో మోడీ అన్నారు. విభిన్న హోదాల్లో నర్సింహారావు పనిచేసినట్లు వెల్లడించారు.
నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డ పీవీ నర్సింహారావుకు భారతరత్న రావడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. పీవీ దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని మార్చేశారని అన్నారు.
భారత్ బలమైన ఆర్థిక శక్తిగా మారేందుకు పునాది వేసిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీకి కేంద్రం ‘భారతరత్న’ ప్రకటించడం.. తెలుగువారికే కాదు భారతీయులందరికీ సంతోషకరమైన విషయం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. పీవీతోపాటు ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్‌లకు కూడా భారతరత్న వరించడం పట్ల కూడా చిరు సంతోషం వ్యక్తం చేశారు.
పీవీ నరసింహారావు తన చివరి శ్వాస వరకు ఎంతో శ్రమించారని తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పి.వి నర్సింహ్మ రావు వేసిన ఆర్థిక సంస్కరణల పునాదుల ఫలంగానే నేడు భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలవంతమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు.
పీవీకి భారతరత్న ప్రకటించడంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. పీవీకి భారతరత్న ప్రకటించాలన్న బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్‌ను గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.