‘పుష్ప’ మూవీ టీమ్.. తిరుమల శ్రీవారి సన్నిధిలో సందడి చేసింది. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో పాటు నిర్మాత నవీన్, నటుడు సునీల్, తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ‘పుష్ప’ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో శ్రీవారిని సన్నిధికి వచ్చామని ఆ సినిమా యూనిట్ చెప్పింది.
ఈ సినిమా పార్ట్-2 నిర్మాణాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభించనున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. కాగా, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. గత రాత్రి తిరుపతిలో ఈ సినిమా సక్సెస్ పార్టీని నిర్వహించారు.