AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శల దాడి ఎక్కువ అవుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తనవిగా జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోందని విమర్శించారు.
సీఎం జగన్ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని పురందేశ్వరి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో లబ్ది పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. దొంగ ఓట్ల దందా అంతా సీఎం జగన్ నడిపిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులతో పాటు ఓటర్లను కూడా ఒకచోట నుంచి మరో చోటుకు బదిలీ చేస్తున్నారని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు.
గుంటూరు వెస్ట్‌లో 10 వేల మంది నకిలీ ఓటర్లను నమోదు చేస్తున్నారని పురందేశ్వరి అన్నారు. ఓటర్లను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారుస్తున్నారని, దొంగ ఓట్లు, దొంగ ఓటరు కార్డులను సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ది పొందాలని వైసీపీ చూస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు.