కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు సర్వమానవాళి హడలెత్తిపోతోంది. అగ్రదేశాలను సైతం గడగడలాడిస్తున్న ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌లో లాక్‌డౌన్ ఒక్కటే ఆయుధంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతటా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పలుచోట్ల ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు.
కరోనాతో యుద్ధంలో ముందుండి ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులపై పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి. పంజాబ్‌లో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసుపై కత్తితో దాడిచేసి ఏకంగా అతడి చేయిని నరికేశారు కొందరు దుండగులు. ఐదుగురు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడులకు తెగబడ్డారు. రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను వాహనంతో ఢీకొట్టి గుంపుగా పోలీసులపై దాడిచేశారు. ఒక ఏఎస్సై చేతిని నరికేశారు. దాడి అనంతరం నిందితులు పరారయ్యారు.