ఏపీ రాజకీయ తెర పై ప్రస్తుతం టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి వ్యవహారమే ప్రధానంగా సాగుతుంది. గన్నవరం ఎపిసోడ్ నేపథ్యంలో పట్టాభి కనిపించడం లేదంటూ ఆయన భార్య ఆందోళనకు గురి అయ్యింది. గతంలో ఇలాగే పోలీసులు ఎత్తుకు వెళ్లిన రఘు కృష్ణంరాజు పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. పట్టాభికి కూడా అదే దుస్థితి పడుతుందేమో అని ఆయన భార్య భయ పడుతూ రోడ్డు ఎక్కింది. ఇందులో సగటు ఇల్లాలు అవేదనను మాత్రమే చూడాలి. నిజమే కావొచ్చు. పట్టాభికి నోటి దురుసు ఎక్కువే కావొచ్చు. కానీ పట్టాభి కుటుంబం ఏం చేసింది ?, పట్టాభి కుటుంబ సభ్యులను ఎందుకు బాధ పెట్టాలి ?, ఒకవేళ చట్టరీత్యా పట్టాభి తప్పు చేస్తే.. అధికారికంగా అరెస్ట్ చేసి విచారించండి. అంతేగాని, పట్టాభి భార్య పై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఆమె కుటుంబాన్ని వేదనకు గురి చేయడం భావ్యం కాదు.
ఒకపక్క పట్టాభి భార్య చందన తన భర్త ఏమైపోయాడో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటే.. మరోపక్క పట్టాభి భార్యతో నాటకానికి తెరలేపారని వైసీపీ నేతలు ఆరోపిస్తుండటం నిజంగా దిగజారు రాజకీయానికి నిదర్శనమే. గన్నవరం ఎపిసోడ్ లో పట్టాభి తప్పేం లేదు. కేవలం అతను అక్కడకి వెళ్ళాడు. అది ఒక్కటే అతను చేసిన తప్పు. జగన్ రెడ్డి పాలన గురించి తెలిసి కూడా పట్టాభి అలా గుడ్డిగా ముందుకు వెళ్లడం అతను చేసిన తప్పు. సరే.. ఇంత జరుగుతున్నా..వైసీపీ మీడియా ఏం చేస్తోందో తెలుసా ?. పట్టాభి కనిపించడం లేదంటూ చంద్రబాబు డ్రామాకు క్లాప్ కొట్టారట. మిగిలిన నాయకులు అందుకుని రక్తి కట్టిస్తున్నారట. వైసీపీ నేతలు కూడా ఇవే మాటలను చెబుతున్నారు.
పట్టాభి భార్య చందన మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందడం అందరికీ బాధ కలిగిస్తుంటే.. వైసీపీ నేతలకు మాత్రం సంతోషాన్ని కలిగిస్తునట్టు ఉంది. పైగా తన భర్త నోటిని అదుపులో పెట్టుకోవాలని ఎప్పుడైనా చందన తన భర్తకు చెప్పి వుంటే బాగుండేదని ఆమెకు వైసీపీ నేతలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వైసీపీ నేతల నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుతారు. ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని నాయకులుగా వైసీపీ నేతలు తయారవుతున్నారు. ఐతే, వైసీపీ నేతల ఆరోపణల్లో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి. కేవలం టీడీపీలో వ్యక్తిగతంగా ఎదిగేందుకు పట్టాభి ప్రత్యర్థులపై అవాకులు చెవాకులు పేలుతుంటారు. ఈ అవాకులు చెవాకులే ఇప్పుడు ఆయన కొంప ముంచాయి.
ముఖ్యంగా పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై చాలాసార్లు వ్యక్తిగతంగా నోరు పారేసుకున్నారు. ఎప్పుడైనా, ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు, ఐతే అది చట్టరీత్యా ఉండాలి. అంతేగాని, వైసీపీ పార్టీ చేసే విధంగా కాదు. రాక్షస జాతిలో కూడా శిక్షలకు సరైన విచారణ ఉంటుంది. కానీ, జగన్ రెడ్డి పాలనలో కనీస విచారణ కూడా లేకపోవడం కొసమెరుపు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో డీజీపీ సిగ్గు పడాలి. జగన్ రెడ్డి మన్ననలు పొందడానికి డీజీపీ తన వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టడం గన్నవరం ప్రజలు చేసుకున్న దురదృష్టం.