భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. కోచ్‌ల విభాగంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి గోపీచంద్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐఓసీ అథ్లెటిక్ కమిషన్ శనివారం ప్రకటించింది. బ్యాడ్మింటన్ అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా గోపీచంద్‌కు పురుషుల విభాగంలో ‘2019 ఐఓసీ జీవిత సాఫల్య కోచ్ అవార్డు’ దక్కిందని పేర్కొంది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారత కోచ్ గోపీచంద్ కావడం విశేషం.
ప్రతిష్ఠాత్మక ఐఓసీ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉందని గోపీచంద్ పేర్కొన్నాడు. ”ఇది భారత కోచ్‌లందరికీ దక్కిన గౌరవంగా భావిస్తా. భారత ప్రభుత్వానికి, క్రీడా మంత్రిత్వ శాఖ, బ్యాడ్మింటన్ అసోషియేషన్, భారత ఒలింపిక్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు. ఇలాంటి అవార్డులు మరింత మెరుగ్గా శిక్షణ ఇచ్చేలా కోచ్‌లను ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. భారత బ్యాడ్మింటన్‌కు మరిన్ని సేవలు అందించడానికి ఇది నాకు ప్రేరణగా నిలుస్తుంది” అని గోపీచంద్ ఈ సందర్భంగా అన్నారు.