హీరో విశాల్ తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ హిట్ కావడంతో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు సినిమా విడుదల తర్వాత కూడా విశాల్ ప్రమోషన్ల కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాడు. చిత్రం ప్రమోషన్‌లో మాట్లాడుతూ నిర్మాతలుగా మారాలనుకునే వారికి ఓ సలహా ఇచ్చాడు. మూడు, నాలుగు కోట్లు పట్టుకుని సినిమాలు తీయడానికి ఎవరూ రావద్దని విశాల్ అంటున్నాడు.
కథను బట్టి, డిమాండ్‌ను బట్టి సినిమా బడ్జెట్ ఉంటుందని విశాల్ అంటున్నాడు. ఇంత బడ్జెట్‌లోనే సినిమాను నిర్మించాలనే నిబంధన ఏదీ ఉండదని అన్నాడు. ఒక సినిమాను కోటి రూపాయలతో తీయొచ్చు లేదా రూ. 100 కోట్లతోనూ తీయొచ్చని విశాల్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై నిర్మాత కార్తీక్ వెంకట్రామన్ కౌంటర్ ఇచ్చారు. విశాల్ వ్యాఖ్యలు సరికాదని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడరాదని హితవు పలికారు. విశాల్ మాటలు వింటుంటే ఇదొక కొత్త సనాతన ధర్మమేమో అనిపిస్తోందని అన్నారు.