వివాదస్పర దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆయన సినిమాలేవి విడుదల కాకుండా చేస్తామని హెచ్చరించాడు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన క్రాంతి, కరుణలపై ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గా తాజాగా నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. డబ్బులు తిరిగి ఇవ్వమని అడితే.. ఫోర్జరీ చేశారంటూ తన పిల్లలపై ఆర్జీవీ తప్పుడు కేసులు పెట్టాడని ఆరోపించాడు. డబ్బులు బాగానే తీసుకున్నాడని.. ఇవ్వమని అడిగితే ఫేక్ అంటున్నాడని మండిపడ్డారు. తనతో పాటు చాలా మందిని ఆర్జీవీ మోసం చేశాడని ఆరోపించారు. అప్పులు ఇచ్చిన వాళ్లంతా ఒకటయ్యామని, ఇక ఆర్జీవీ పని అయిపోయిందని హెచ్చరించాడు. ఆయన సినిమాలేవి విడుదల కాకుండా చేస్తామన్నారు. వర్మ పేరు మీద సినిమా వస్తే.. సుప్రీకోర్టు వరకు వెళ్లి అయినా సరే స్టే తీసుకుంటాం అని చెప్పారు. నిర్మాతలెవరు ఆయనతో సినిమా చేయొద్దని కోరారు.