భారతీయ నటి ప్రియాంకా చోప్రా తన మానవతా కార్యకలాపాలకు గాను ‘డేనీ కాయే హ్యుమానిటేరియన్ అవార్డు’ అందుకుంది. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన 15వ వార్షిక యూనిసెఫ్ స్నోఫ్లేక్ బాల్ కార్యక్రమంలో ప్రియాంకకు ఈ అవార్డు ప్రదానం చేశారు. యునిసెఫ్ ప్రియాంకను తమ బాలల హక్కుల గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ అవార్డు తనకెంత విలువైనదో పీసీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ”యూనిసెఫ్‌తో పనిచేసే వ్యక్తుల అలుపెరుగని ప్రయత్నానికి, చెదరని దృఢ సంకల్పానికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీ ప్రయాణంలో నన్ను కూడా భాగం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. మీ తరపున గుడ్‌విల్ అంబాసిడర్‌గా సేవ చేయటం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం.” అని తెలిపింది. తన సతీమణికి అవార్డు రావటంపై, ”15 సంవత్సరాలుగా యూనిసెఫ్, యూనిసెఫ్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నువ్వు ప్రపంచానికి చేస్తున్న మేలుకు, నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది. నువ్వు నువ్వుగా ఉండి నాకు ప్రతిరోజూ ప్రేరణనిస్తున్నావు. కంగ్రాట్యులేషన్స్ మై లవ్…” అంటూ నిక్ జొనాస్ స్పందించారు.