యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కుమార్తె, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఆమె నియమితులైన నేపథ్యంలో ట్విట్టర్‌లో ఆమెకు సంబంధించిన విషయాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం ప్రపంచంలోనే టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. బుధవారం మధ్యాహ్నం #PriyankaGandhi వరల్డ్‌వైడ్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. అలాగే, AICC General, Priyanka Vadra, Cogress General అనే హ్యాష్‌ట్యాగ్‌లు వరసగా 14, 15, 18వ స్థానాల్లో ఉన్నాయి.
ఇక భారత్‌లోనూ ప్రియాంకకు సంబంధించిన పలు హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. మొదటి 15 ట్రెండ్స్‌లో 11 ఆమెకు సంబంధించినవే ఉండడం విశేషం. #PriyankaGandhi, #PriyankainPolitics, #PriyankaEntersPolitics ట్యాగ్‌లు భారత్‌లో మొదటి, మూడవ , ఐదో ట్రెండ్‌లో ఉన్నాయి. అలాగే.. Priyanka Vadra, AICC General, Cogress General, UP East, General Secretary పదాలు.. వరసగా ఆరు నుంచి 10వ స్థానాల్లో ఉన్నాయి. భారత్-న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన #NZvIND రెండో స్థానంలో ఉంది. కాగా, ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంకా గాంధీ తన బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.