HomeTelugu News16 ఏళ్ల బాలిక అద్భుత ప్రసంగం.. ప్రియాంక ప్రశంసలు

16 ఏళ్ల బాలిక అద్భుత ప్రసంగం.. ప్రియాంక ప్రశంసలు

12 16ఐక్యరాజ్య సమితి సదస్సులో వాతావరణంలో మార్పులపై అద్భుతమైన ప్రసంగం చేసిన 16 ఏళ్ల స్వీడన్‌ బాలిక గ్రెటా థన్‌బర్గ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ అధినేతలను ఉద్దేశిస్తూ ‘మమ్మల్ని ఓడిపోయేలా చేస్తే మేం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించబోం’ అంటూ బాలిక చేసిన ప్రసంగానికి విశేష మద్దతు లభిస్తోంది. నేతలను సూటిగా ప్రశ్నిస్తూ గ్రెటా చేసిన ప్రసంగంపై బాలీవుడ్‌ నటి, ఐరాసలో గుడ్‌విల్‌ అంబాసిడర్‌ అయిన ప్రియాంక చోప్రా స్పందించారు. ”మిమ్మల్ని ఓడించడానికి మాకెంత ధైర్యం? నీకు కృతజ్ఞతలు గ్రెటా.. మీ తరాన్ని ఒకచోట చేర్చి ఈ విషయంపై అవసరమైన విధంగా మా ముఖాలపై గుద్దినట్టు చెప్పినందుకు. అలాగే, మేం ఇంకా బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వివరించినందుకు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనకు ఎంతో అవసరం. చివరకు మనకు ఈ ఒక్క గ్రహం మాత్రమే మిగిలి ఉంటుంది” అని ప్రియాంక పేర్కొంటూ #howdareyou అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

వాతావరణ మార్పులపై ప్రపంచ నేతలు తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ ”అర్థంపర్థంలేని మాటలతో మా కలల్ని, మా బాల్యాన్ని దోచుకుంటున్నారు. మీకెంత ధైర్యం. వాతావరణ మార్పులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. ప్రాణాల్ని సైతం కోల్పోతున్నారు. మా తరం తీవ్ర విపత్తుకు ఆరంభంలో ఉంది.. మా ఆవేశం, ఆవేదన మీకు అర్థమవుతుందనే ఇదంతా చెబుతున్నా. నిజంగా మీకు అర్థమైతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. మీ మోసాన్ని నేటి యువతరం అర్థం చేసుకుంటుంది. భవిష్యత్‌ తరాల కళ్లన్నీ మీ వైపే ఉన్నాయి. మీరు ఇలాగే మమ్మల్ని ఓడిపోయేలా చేస్తే మేం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించబోం” అంటూ గ్రెటా ఐరాస సదస్సులో ఉద్వేగంతో ప్రసంగించడం అందరినీ ఆకట్టుకుంది. ఆమె ప్రసంగం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రముఖ నటి అలియా భట్‌ కూడా స్పందించింది. ”వినండి.. నేర్చుకోండి.. ఆలోచించండి.. పనిచేయండి” అని పేర్కొంటూ గ్రెటా ప్రసంగాన్ని ఆమె తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu