భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘చంద్రయాన్ 2’ ప్రయోగంపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల ఇస్రో జీఎస్‌ఎల్‌వీ మార్క్ (ఎంకే)-3 రాకెట్ సాయంతో ‘చంద్రయాన్ 2’ ను జాబిల్లిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను ప్రియాంక ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్ 2′ విజయం వెనకున్న మహిళా శాస్త్రవేత్తలు ముత్తయ్య వనిత, రీతూ కరిధాల్ మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. నేను శాస్త్రవేత్తను అవ్వాలనుకున్నాను. వీరిద్దరినీ చూశాక కలలు నిజమవుతాయని అనిపించింది. ఇస్రో టీంను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇటీవల ప్రియాంక తన 36వ పుట్టినరోజును జరుపుకొన్నారు. సెలబ్రేషన్స్ కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నారు.