రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థననుతిరస్కరించారు. ముఖేశ్ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్రపతి భవన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేశ్ దరఖాస్తును రాష్ట్రపతి నేడు తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా క్షమాభిక్ష రూపంలో ఆటంకం ఏర్పడింది. ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున శిక్ష అమలును వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. కారాగార నిబంధనల ప్రకారం.. కేసులో ఒకరికంటే ఎక్కువ మంది దోషులు ఉన్నప్పుడు వారిలో ఒకరు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నా.. అది తేలే వరకు మిగిలిన వారికీ శిక్షను అమలు చేయడం కుదరదు. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజా పరిణామాలతో ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత నెలకొంది. క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడంతో ముందుగా కోర్టు ఆదేశించినట్లు జనవరి 22న దోషులకు ఉరి తీస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.