Pratinidhi 2 Movie Review: ఎన్నికల సీజన్ కావడంతో.. రాజకీయం నేపథ్యంలో సాగే అనేక సినిమాలు థియేటర్‌ల్లో క్యూ కడుతున్నాయి. ప్రేక్షకులంతా అదే మూడ్‌లో ఉంటారు కాబట్టి తగిన సీజన్ ఇదే అని భావిస్తూ దర్శక-నిర్మాతలు రాజకీయ ప్రధానంగా సాగే సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. ఈసారి ఆ జాబితాలో కనిపించిన కీలకమైన సినిమా… ‘ప్రతినిధి2’. నారా రోహిత్ గతంలో చేసిన ‘ప్రతినిధి’ సినిమాకి కొనసాగింపుగా ఇది రూపొందింది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
టీవీ 5 మూర్తి అంటే కరుడుకట్టిన పసుపు జర్నలిస్ట్ అని అందరికీ తెలిసిందే. చంద్రబాబుకి నమ్మిన బంటుగా.. అధికార వైసీపీ పార్టీపైన విషం చిమ్ముతూ ఉంటారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉంటాయి. టీవీ షోలనే ఏకపక్షంగా చర్చలు నడిపించి.. చంద్రబాబుకి వీర విధేయత చూపుతారని చెరుపుకోలేని మచ్చ అంటించుకున్న టీవీ5 మూర్తి దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ సినిమా రిలీజ్ అవుతుందంటే సినీ, పొలిటికల్ సర్కిల్స్‌లో చాలా సందేహాలు ఏర్పడ్డాయి. అయితే మూర్తి మాత్రం.. తన టార్గెట్ వైసీపీ కాదని ఆడియన్స్ మాత్రమేనని.. ఇది పక్కా కమర్షియల్ పొలిటికల్ డ్రామా మాత్రమే అని ‘ప్రతినిధి 2’ పై వచ్చిన రూమర్లను ఖండించారు. అయితే ఈ సినిమాలో నిజంగానే ఆడియన్స్ టార్గెట్‌గా చేశారా? లేదంటే.. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలకు కొమ్ముగాసే చిత్రమా? చూద్దాం.
(నారా రోహిత్) నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. నిజాలను వెలికితీస్తూ సంచలన కథనాలతో తన వృత్తి పట్ల దూకుడుగా ఉంటాడు చే. సమాజం పట్ల బాధ్యతగా ఉండే జర్నలిస్ట్ ఉదయభాను (ఉదయభాను) నిస్వార్ధంగా ..లాభం ఆశించకుండా.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో NNC ఛానల్‌ని ప్రారంభిస్తుంది. ఆ ఛానల్‌కి చే ని సీఈవోని చేస్తుంది. తన సంచలనాత్మక కథనాలతో రాజకీయ నాయకులకు కునుకు లేకుండా చేస్తుంటాడు చే.
ఇంతలో పేదల పెన్నిధి.. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ప్రజాపతి (సచిన్ ఖేడేకర్) బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోతారు. తండ్రి మరణంతో కొడుకు విశ్వ (‘ప్లే బ్యాక్’ ఫేమ్ దినేష్ తేజ్) ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతాడు. సరిగ్గా అదే టైంలో సీఎం బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెడతాడు చే. ఆ ప్రయత్నంలో అసలు నేరస్తుడు చే అనే ఆరోపణపై అరెస్ట్ అవుతాడు. అసలు సీఎంని చంపాలనుకున్నదెవరు? చేకి ఆ బాంబ్ బ్లాస్ట్‌కి సంబంధం ఏంటి? అందులో సీఎం ఓఎస్‌డీ సిరి (సిరీ లెల్లా) పాత్ర ఏంటి? సీఎం మర్డర్ మిస్టరీకి చేకి లింక్ ఏంటి? ఆ కేసును ఎలా ఛేదించారు అనేదే కథ.
ఈ సినిమా వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ‘ప్రతినిధి’ తెరకెక్కింది. అందులో ఓ కామన్ మేన్‌గా కనిపించిన నారా రోహిత్… ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా కనిపిస్తాడు. నారా రోహిత్… మూర్తి కలయిక అనగానే సహజంగానే ఇది ఓ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాలో ఉంటారు చాలా మంది. కానీ, ఈ కథ అందుకు పూర్తి భిన్నంగా తెరకెక్కింది.
ముఖ్యమంత్రి హత్య, ఆ తర్వాత ఆయన కొడుకు ఆ పదవి చేపట్టాలనుకోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసినా… దానికంటే కూడా ఫక్తు కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు. ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడే సినిమాగా కాకుండా… జర్నలిజం, రాజకీయ వ్యవస్థల్ని తనదైనకోణంలో ఆవిష్కరించారు. తొలి సగభాగంలో కలం చేతపట్టిన కథానాయకుడు…ద్వితీయార్ధంలో కత్తి పడతాడు. ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఆరంభ సన్నివేశాలు హీరో పాత్ర నైజాన్ని… జర్నలిజం గొప్పతనాన్ని చాటుతాయి. కథానాయకుడు ఎన్.ఎన్.సి ఛానల్‌లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. మంత్రి గజేంద్ర (అజయ్ ఘోష్) అరాచకాల్ని ప్రశ్నించి అతని పదవి పోయేలా చేయడం, తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేసిన నరసింహ (పృథ్వీరాజ్) చేసిన ఆకృత్యాల్ని వెలుగులోకి తీసుకు రావడం… ఆ నేపథ్యంలో పండే డ్రామా సినిమాకి కీలకం. ఓటు విలువని చాటి చెబుతూ తీర్చిదిద్దిన సన్నివేశాలూ సినిమాకి బలం. విరామ సన్నివేశాలకి ముందు చోటు చేసుకునే మలుపు ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతుంది. అప్పటిదాకా సహజంగా సాగుతున్నట్టుగా అనిపించిన సినిమా… ఆ తర్వాత కథ, కథనాలు మరీ నాటకీయంగా మారిపోతాయి. ఓ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లో బాంబు పేలుడు, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు, కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు అసంబద్ధంగా అనిపిస్తూ, సినిమా గతిని మార్చేశాయి. మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుని ఆ సన్నివేశాల్ని మలిచినట్టు అనిపిస్తుంది.
ద్వితీయార్ధంలో హీరో కుటుంబ నేపథ్యం, అతని లక్ష్యం, పాటలు, ఫైట్లు… ఇవన్నీ ఓ సగటు ఫార్ములా తెలుగు సినిమా కథల్నే గుర్తు చేస్తాయి తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా సాగుతాయి. ప్రతిష్టాత్మకమైన పరిశోధన సంస్థ సీబీఐని ఇందులో మరీ సాదాసీదాగా చూపించడం పెద్దగా మెప్పించదు. మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందిన మరో సగటు చిత్రం… ప్రతినిధి 2.
నిజాయితీ గల జర్నలిస్ట్ పాత్రలో రోహిత్ ఒదిగిపోయారు. అయితే ఎప్పుడో గత ఎలక్షన్స్‌కి ముందు హీరోగా కనిపించిన నారా వారబ్బాయి.. సరిగ్గా ఇప్పుడు మళ్లీ ఎలక్షన్స్‌కి కనిపించారు. నటన పరంగా పర్వాలేదు కానీ.. పాటలు, ఫైట్స్‌లో మాత్రం నారా రోహిత్ భారీ దేహంతో భారంగానే కనిపించాడు. నటనపరంగా.. ఈ సినిమాలో కంటే గత చిత్రాల్లోనే బాగా చేశాడనే భావన కలుగుతుంది. ఇంట్రో సీన్‌లో ముసలి రౌతుగా వేరియేషన్స్ చూపించాడు. పెన్ను పట్టిన చేతితోనే కత్తి పట్టి ఊచకోత కోసేశాడు.
ఇక హీరోయిన్ సిరీ లెల్లాకు ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. డ్యుయెట్ సాంగ్, లవ్ ట్రాక్ పెద్దగా సెట్ కాలేదు. సచిన్ ఖేడేకర్ తన పాత్రలో ఒదిగిపోయాడు. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే.. హీరో కంటే కూడా.. సచిన్ ఖేడేకర్ ఎక్కువ స్కోప్ లభించింది. సీఎం కొడుకుగా ‘ప్లే బ్యాక్’ ఫేమ్ దినేష్ తేజ్ మరో ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు. ఇక కమెడియన్ పృథ్వీ, ఉదయభాను, తనికెళ్ల భరణి, ఇంద్రజ, అజయ్ ఘోష్, సప్తగిరి, జిష్షు సేన్ గుప్తా, రఘు బాబు, రఘు కారుమంచి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మహతి స్వర సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్.. బాగుంది. సాంగ్స్ బాగానే ఉన్నా.. కథకి అవసరం లేదన్నట్టుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.