నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి తన డ్రైవర్ రాజేష్‌తోపాటు ఖైరతాబాద్ చింతలబస్తీలోని ఆర్యవైశ్య భవన్ మూడో అంతస్తులో రూం నెంబర్ 306లో దిగారు. మారుతీరావు గదిలో ఉండగా డ్రైవర్ బయటే ఉన్నాడు. ఆదివారం ఉదయం మారుతీరావు భార్య పలుమార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో డ్రైవర్‌కు కాల్ చేసి విషయం అడిగారు. ఫోన్ చేస్తే తీయడంలేదేని చెప్పడంతో డ్రైవర్ రూమ్‌కి వెళ్లి తలుపు తట్టినా తీయలేదు. ఎంతకీ తెరకపోవడంతో సిబ్బందితో కలిసి బలంగా తలుపు తెరిచి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో పడివున్నారు. వెంటనే అతని బంధువులు, పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యా?లేక సాధారణ మరణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రణయ్ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బనాయించిన కేసుల ఒత్తిడి కారణంగానే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
అత్యంత దారుణమైన పరువు హత్య 2018 సెప్టెంబరు 14న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. మిర్యాలగూడలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన బాలస్వామి, ప్రేమలతల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్(24), అదే పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తిరునగరు మారుతీరావు కుమార్తె అమృత పదోతరగతి నుంచి స్నేహితులు. జనవరిలో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తి ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. అమృత తన భర్త దగ్గరే ఉంటానని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అప్పటి నుంచి తన భర్త ఇంటి వద్దే ఉంటొంది. గొడవలు సద్దుమణిగిన తర్వాత వరుడి తల్లిదండ్రులు మిర్యాలగూడలో వివాహ విందు ఏర్పాటు చేయగా… అమ్మాయి తరఫు బంధువులు హాజరుకాలేదు. ఆసమయంలో అమృత గర్భిణి. దీంతో సెప్టెంబరు 14న మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం అమృతను తీసుకుని ప్రణయ్, ఆయన తల్లి ఆసుపత్రికి వచ్చారు. అనంతరం తిరిగి వెళుతుండగా.. ప్రధాన ద్వారం వద్దకు ప్రణయ్ చేరుకోగానే ఆసుపత్రిలోనే మాటు వేసిన దుండగుడు వెనక నుంచి వచ్చి అతడి మెడపై కత్తితో వేటువేశాడు. దీంతో ప్రణయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగుడు మరో వేటు వేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ హత్యకు అమ్మాయి తండ్రి మారుతీరావే కారణమని భావించిన పోలీసులు ఏ1గా అతడిని, ఏ2గా అమృత బాబాయి శ్రవణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం మారుతీరావు బెయిల్‌పై విడుదల కాగా..ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.