ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘420’లు (మోసానికి పాల్పడినవారు) వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అది కాంగ్రెస్ అయినా, ఇతర ఏ పార్టీ అయినా ఇలా మాట్లాడడం అహంకారమేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కర్ణాటకలోని చిక్కమగళూరులో ఆదివారం తాజాగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తేనే ఏ పార్టీ అయినా సీట్లు గెలుస్తుందని, ముందుకెళ్లి తామే తీసుకుంటామని ఏ పార్టీ చెప్పజాలదని అన్నారు. ఇలా చెప్పడం వారి అహంకారానికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ఈసారి 400 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
400 సీట్లతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఫిబ్రవరి 5న రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో లోక్‌సభలోనూ మోడీ ఈ మాట అన్నారు. ఎన్డీఏ మూడవ దశ ప్రభుత్వం ఏర్పడడానికి ఇంకా ఎంతో దూరం లేదని, ఈసారి 400 సీట్లు గెలుస్తామన్న విషయం తెలిసిందే.