రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ‘కశ్మీర్ ఫైల్స్ మూవీలోని హింస, గోరక్షక దళాలు, మానవత్వం’ గురించి మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలపై శనివారం (జూన్ 18) స్పష్టతనిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.
ఈ వీడియోలో తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ఇచ్చిన వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ‘మానవత్వమే అన్నింటికంటే ముందు. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం.’ అని రాసుకొచ్చారు ప్రకాశ్ రాజ్. కాగా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘విరాట పర్వం’ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు.