‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు సజావుగా సాగాయని, ఎన్నికల్లో ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని తెలిపారు. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టకరమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని ప్రకటించారు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్ తెలిపారు.
‘‘మంచు విష్ణు, రఘుబాబు, రవితో పాటు గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు. మీరిచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. నన్ను అతిథిగా మాత్రమే ఉండమన్నారు. ‘మా’తో నాకు 21ఏళ్ల అనుబంధం. ఆత్మాభిమానం ఉన్నవాడిని. నాకు ఓట్లు వేసిన అందరికీ కృతజ్ఞతలు. బీజేపీ నేత కూడా ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాలవారు తెలుగు సినిమాల్లో నటించొద్దన్న నిబంధనలు ఏమీ లేవు. అందుకే తెలుగు సినిమాల్లో యథావిధిగా నటిస్తా. నేను యూనివర్సల్ పర్సన్‌ను’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.