‘మా’ సిగ్గుపడేలా నటుడు నరేశ్ ప్రవర్తిస్తున్నారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. నరేశ్ అహంకారి అని.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ప్రచార కార్యక్రమాల్లో జోరుపెంచారు. ఇందులో భాగంగా అసోసియేషన్ సభ్యులతో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో విష్ణు ప్యానల్, నరేశ్‌లపై ఆయన మండిపడ్డారు. ఈ సారి జరగనున్న ‘మా’ ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని.. పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే ‘మా’ అధ్యక్షుడిగా గెలవాలని పేర్కొన్నారు. ఆ సత్తా తనకి ఉందని.. అందుకే తాను ఈ సారి ఎన్నికల్లో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను తెలుగు వాడిని కాదంటూ నరేశ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు.
‘‘నేను తెలుగు మాట్లాడినంతగా మంచు విష్ణు ప్యానల్‌లో ఎవరూ మాట్లాడలేరు. నన్ను పెంచింది తెలుగు భాష. మంచు విష్ణు నరనరాల్లో నటన ఉంది. ‘మా’ అసోసియేషన్ కోసం బాధ్యతతో పనిచేయాలని వచ్చాను. మా సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆత్మాభిమానం ఉంది. మేం ప్రశ్నించకపోతే ఈసారి ‘మా’ ఎన్నికలే ఉండేవి కాదు. ‘మా’ ఎన్నికల గురించి ప్రశ్నించినందుకు బెదిరించారు. నేను ఒక ఉత్తరం రాస్తే ‘మా’ అసోసియేషన్‌కే తాళం పడేది. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడడం కూడా తెలుసు. ఎన్నికల్లోకి వైఎస్ జగన్, కేసీఆర్, బీజేపీ లను లాగుతారా? వైఎస్ జగన్ మీ బంధువైతే ‘మా’ ఎన్నికలకు వస్తారా? రెండు సార్లు హలో చెబితే కేటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా? మీరు గెలవడానికి ప్రయత్నించండి, అవతలివారిని ఓడించడానికి కాదు? చాలా బాధతో, ఆక్రోశంతో సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నాం. ఓట్ల సునామీలో మంచు విష్ణు ప్యానల్ కొట్టుకుపోతుంది’ అని ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.