ఎన్నికల సమయంలో దగ్గర పడటంతో ‘మా’ రాజకీయం మరింత వేడెక్కుతున్నాయి. మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని చెప్పారు. ఈ మేరకు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. అనంతరం జీవితా రాజశేఖర్, శ్రీకాంత్ తదితరులతో కలిసి ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడారు.
‘‘60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానల్ సంతకాలు సేకరిస్తోంది. నిన్న సాయంత్రం విష్ణు తరఫున ఓ వ్యక్తి 56 మంది సభ్యుల తరఫున రూ.28వేలు కట్టారు. ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు? కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా?ఇలా గెలుస్తారా?మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.