HomeTelugu Newsప్రజావేదికలో చంద్రబాబునాయుడు సామాన్లును బయటపడేశారు

ప్రజావేదికలో చంద్రబాబునాయుడు సామాన్లును బయటపడేశారు

3 20
ప్రజావేదికలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తిగత సామాన్లను ప్రభుత్వ సిబ్బంది బయటపడేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సామాన్లను బయటపడేయడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

వైసీపీ అధికారం చేపట్టాక తొలి కలెక్టర్ల సదస్సుకు ‘ప్రజావేదిక’ వేదికగా మారింది. తొలుత వెలగపూడి సచివాలయంలోని అయిదో బ్లాక్‌ సమావేశ మందిరంలో సదస్సు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఉండవల్లి సమీపంలోని కృష్ణా నది కరకట్టను ఆనుకొని ఉన్న ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజావేదిక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాస ప్రాంగణం పక్కనే ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజావేదిక భవనాన్ని వాడుకునేందుకు తనకు కేటాయించాలని కోరుతూ చంద్రబాబు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కొన్ని రోజుల కిందట లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

తాజాగా కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది. కలెక్టర్ల సదస్సు కోసం ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్రవారం సాధారణ పరిపాలనశాఖ అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌ తదితరులు ప్రజావేదిక భవనాన్ని పరిశీలించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ల సదస్సు ప్రజావేదికలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈక్రమంలో ప్రజా వేదిక భవనంలో చంద్రబాబు వ్యక్తిగత సామగ్రిని ప్రభుత్వ సిబ్బంది బయటపడేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజావేదికను సుమోటోగా స్వాధీనం చేసుకోవడం కక్షసాధింపు చర్యేనని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కావాలనే ఈవిధంగా చేశారని స్పష్టమవుతోందన్నారు. ప్రజావేదిక ఇవ్వడం ఇష్టం లేకపోతే ప్రభుత్వం రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ.. ‘ప్రజావేదిక చంద్రబాబు నివాసానికి అనుబంధంగా ఉంది. చంద్రబాబు సామగ్రి ఖాళీ చేసేటప్పుడు కనీస సమాచారం ఇవ్వాలి. ఉదయం 10గంటలకు మేము వచ్చే లోపే వస్తువులు ఆరుబయట పడేశారు’ అని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu