శనివారం సాయంత్రం కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా చంద్రబాబు చేపట్టిన ఎన్నికల రోడ్‌షోలో భాగంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతోనే సీఎం కేసీఆర్‌కు తన కుమారుడికి కె.తారక రామారావు పేరు పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు. కానీ, ఆ కుటుంబంపై తండ్రీ కొడుకులకు కృతజ్ఞతాభావం లేదని విమర్శించారు. గతంలో టీడీపీ జెండా నీడ కింద గెలిచిన ఇక్కడి టీఆర్‌ఎస్ అభ్యర్థికైనా కృతజ్ఞత ఉంటే టీడీపీ మూలవిరాట్‌గా నిలబడిన మహానీయుడి వారసురాలు, చైతన్య రథసారథి కుమార్తె సుహాసిని ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు తప్పుకొని మద్దతు ప్రకటించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ వాళ్లకు ఆ కృతజ్ఞత లేనప్పుడు ప్రజలే వారిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలనతో పోలిస్తే కేసీఆర్‌కు మహిళల పట్ల గౌరవం లేదన్నారు. గతంలో అనేకమంది మహిళలకు మంత్రులుగా ఆ పార్టీలు అవకాశం కల్పించాయని చెప్పారు. మహిళలకు మంత్రి పదవులు ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్, టీడీపీలో కన్పించిది గానీ టీఆర్‌ఎస్‌లో కన్పించలేదన్నారు. అనేక కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కూడా కృతజ్ఞత చెప్పాల్సిన సమయమిదేనన్నారు. మహిళలకు చట్ట సభల్లో గౌరవం దక్కాలంటే సుహాసినిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. నందమూరి కుటుంబంపై తనకు ఉన్న కృతజ్ఞతను చాటుకొనేందుకే తాను ఈ ప్రచారానికి వచ్చానన్నారు. ఎన్టీఆర్ తనకు పెదనాన్న లాంటి వ్యక్తి అని, హరికృష్ణ పెద్దన్న లాంటి వాడని అన్నారు. తనకు కుమార్తెతో సమానురాలైన సుహాసినిని గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు.