యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ వింటేజ్ ప్రేమకథలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా పూజాహెగ్డే కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ వినిపిస్తోంది. అయితే యంగ్ రెబల్ స్టార్ వివాహం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన త్వరలో వివాహం చేసుకోనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఇటీవల ఓ పత్రికతో ముచ్చటించారట. ఇందులో భాగంగా ఆమె ప్రభాస్ వివాహం గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపారట. ప్రభాస్ పెళ్లి కోసం తాము కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని, అలాగే పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ విని నవ్వుకుంటామని ఆమె అన్నారట. అంతేకాకుండా తమది చాలా పెద్ద కుటుంబమని, కనుక అందరితో కలివిడిగా ఉండే ఓ అమ్మాయి కోసం చూస్తున్నామని ఆమె పేర్కొన్నారట. 2020లో ‘జాన్’ విడుదల తర్వాత ప్రభాస్ వివాహం జరుగుతుందని ఆమె చెప్పినట్లు సమాచారం.