సాహో సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని హీరో ప్రభాస్ తెలిపారు. ఈ సినిమా తెలుగుతోపాటు వివిధ భాషల్లో ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ప్రభాస్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై ఉన్న మానసిక ఒత్తిడి గురించి ప్రస్తావించారు. సాహో సినిమా స్క్రిప్టు వల్ల, దర్శకుడు సుజీత్ వల్ల ఎటువంటి ఒత్తిడి లేదని, కానీ ఎస్.ఎస్. రాజమౌళి తనకు ఇచ్చిన బ్లాక్‌బస్టర్ బాహుబలి వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నానని అన్నారు.
ఇప్పుడు నా సినిమా కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. గుజరాత్‌లోని పిల్లలు బాహుబలి పాటలు పాడుతున్నారని నా స్నేహితుడు చెప్పాడు. ఏ ప్రాంతం వాసులు నన్ను ఇష్టపడుతున్నారో కూడా తెలియడం లేదు. కాబట్టి చాలా ఒత్తిడిగా ఉంది. కొన్నిసార్లు భయమేస్తోంది. సాహో వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా, గడుపుతున్నా. దీని వల్ల చాలా రోజులు కంటిమీద కునుకు లేదు కానీ గుర్తింపు వచ్చింది. బాహుబలి వల్ల నాకు గుర్తింపు లభించి ఉండొచ్చు కానీ స్వేచ్ఛ పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, కొన్ని దేశాల్లోని వారికి నేను తెలుసు. ఒకప్పుడు చాలా సార్లు ముంబయికి వచ్చాను. అప్పుడు నన్నెవరూ గుర్తు పట్టలేదు. కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టి, దగ్గరికి వస్తున్నారు. ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే స్వేచ్ఛను కోల్పోయాను.
ఇకపై నేను త్వరగా సినిమాలు చేయాలి. గత ఆరేళ్లుగా చాలా నెమ్మదిగా చిత్రాల్ని చేస్తున్నా. కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా చేయాలి. ఇకపై భారీ బడ్జెట్ సినిమాల్లో నటించాలని లేదు. ఇది చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సాహో ఇన్ని కోట్లు సాధించగలదని నేను అంచనా వేయలేను. కానీ ఈ సినిమాతో బాహుబలి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలని మాత్రమే అనుకుంటున్నా. సాహో ట్రైలర్‌లో మీరు చూసి ట్రక్స్ పక్కకు ఒరిగే సీన్లు సీజీ కాదు. అవన్నీ నిజంగా మేం చేసిన స్టంట్స్. ఈ సినిమా కోసం నేను, శ్రద్ధా చాలా శిక్షణ తీసుకున్నాం. టెక్నీషియన్లు, మొత్తం యూనిట్ సభ్యులు అన్నీ ముందుగానే ప్లాన్ చేసేవారు. లొకేషన్ల కోసం చాలా వెతికారు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాం.