టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాప్యులర్ అయ్యాడు. దాంతో బాలీవుడ్ నుంచి ఆయనకి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను అక్కడ ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసిన ఆయన, మరోసారి ఘన విజయాన్ని అందుకున్నాడు.
ఆ తరువాత అక్కడే ఆయన రణ్‌బీర్ కపూర్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘డెవిల్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన రణ్‌బీర్ కపూర్ ఈ ప్రాజెక్టు పట్ల అంతగా ఆసక్తిని చూపలేదట. దాంతో సందీప్ రెడ్డి ఈ కథను ప్రభాస్ కి వినిపించగా, వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి వుంది. ప్రస్తుతం ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమా షూటింగులో బిజీగా వున్నాడు.