దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’… ఈ సినిమా విడుదలై చాలాకాలమైన ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. తాజాగా ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించారు. ఇప్పటివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించిన తొలి ఇంగ్లిషేతర సినిమా ‘బాహుబలి’ కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు రానా, ప్రభాస్, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు.
చిత్ర ప్రదర్శన సందర్భంగా ప్రభాస్, రానా బీబీసీ విలేకరి హరూన్ రషీద్‌తో ముచ్చటించారు. బాహుబలి సక్సెస్ గురించి తమ ఆనందానుభూతులను పంచుకున్నారు. ‘బాహుబలి’ కి ముందు తెలుగు సినిమాలు ఏమైనా ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా? అని రషీద్ ప్రశ్నించగా.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ చిత్రాన్ని ప్రభాస్ ప్రస్తావించారు. ‘30, సంవత్సరాల కిందట రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా సత్తాను చాటింది’ అని తెలిపారు. అయితే,బాహుబలి సినిమా అంతకుమించి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విజయం సాధించిందని, విదేశాల్లోనూ గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందిందని ప్రభాస్ తెలిపారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.